Sunday, 13 October 2024

శీతాద్రి శిఖరాన

శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు వీరాజనం- కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం॥ యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి బాగైన అందెలకు నీరాజనం-బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం॥ నెలతాల్పు డెందాన వలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం-రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం॥ మనుజాళి హృదయాల తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం-ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం॥ చెక్కిళ్ళ కాంతితో క్రిక్కిరిసి అలరారు మా తల్లి ముంగరకు నీరాజనం-రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం॥ పసి బిడ్డలను జేసి ప్రజనెల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం-అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం॥ దహరాన కనిపించు ఇనబింబ మనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం-నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం॥ తేటి పిల్లల వోలె గాలి కల్లలలాడు మా తల్లి కురులకు నీరాజనం-నీలాల నీరాజనం
భక్తి భావాల నీరాజనం॥ జగదేక మోహినీ,సర్వేశగేహిని మా తల్లి రూపునకు నీరాజనం-నిలువెత్తు నీరాజనం భక్తి విలువెత్తు నీరాజనం॥

Thursday, 10 October 2024

సౌభాగ్యలక్ష్మీ రావమ్మా

సౌభాగ్యలక్ష్మీ రావమ్మా....అమ్మా...సౌభాగ్యలక్ష్మీ రావమ్మా॥ నుదుట కుంకుమ రవి బింబముగ కన్నుల నిండుగ కాటుక వెలుగ కాంచన హారము గళమున మెరియగ పీతాంబరముల శోభలు చిందగ॥సౌభాగ్య॥ నిండుగ కరముల బంగరుగాజులు ముద్దులొలుకు నాదమ్ముల మువ్వలు గలగలమని సవ్వడి జేయగ సౌభాగ్యవతుల సేవల నందగ॥సౌభాగ్య॥ నిత్య సుమంగళి నిత్య కల్యాణి భక్తజనుల మా కల్పవల్లివై కమలాసనవై కరుణనిండగా కనకవృష్టి కురిపించేతల్లి॥సౌభాగ్య॥ జనకరాజుని ముద్దుల కొమరిత రవికులసోముని రమణీమణివై సాథు సజ్జనుల పూజలందుకొని శుభముల నిచ్చెడి దీవెనలీయగ॥సౌభాగ్య॥ కుంకుమ శోభిత పంకజ లోచని వేంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన॥సౌభాగ్య॥ సౌభాగ్యమ్ముల బంగరు తల్లి పురంథర విఠలుని పట్టపురాణి శుక్రవారము పూజలనందగ సాయంకాలము శుభఘడియలలో॥సౌభాగ్య॥