Sunday, 13 October 2024

శీతాద్రి శిఖరాన

శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు వీరాజనం- కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం॥ యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి బాగైన అందెలకు నీరాజనం-బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం॥ నెలతాల్పు డెందాన వలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం-రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం॥ మనుజాళి హృదయాల తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం-ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం॥ చెక్కిళ్ళ కాంతితో క్రిక్కిరిసి అలరారు మా తల్లి ముంగరకు నీరాజనం-రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం॥ పసి బిడ్డలను జేసి ప్రజనెల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం-అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం॥ దహరాన కనిపించు ఇనబింబ మనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం-నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం॥ తేటి పిల్లల వోలె గాలి కల్లలలాడు మా తల్లి కురులకు నీరాజనం-నీలాల నీరాజనం
భక్తి భావాల నీరాజనం॥ జగదేక మోహినీ,సర్వేశగేహిని మా తల్లి రూపునకు నీరాజనం-నిలువెత్తు నీరాజనం భక్తి విలువెత్తు నీరాజనం॥

No comments:

Post a Comment